జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే : మంత్రి పొన్నం

జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే : మంత్రి పొన్నం
  • ఎర్రగడ్డ, మధురానగర్ ముఖ్యనేతలతో మంత్రి పొన్నం
  • సమావేశాలకు మంత్రి తుమ్మల, అజారుద్దీన్ హాజరు

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీ నేతలను సూచించారు. శనివారం తన నివాసంలో ఎర్రగడ్డ డివిజన్ బూత్​ఇన్​చార్జ్​లు, కాంగ్రెస్ నేతలు.. మధురానగర్ లో ఆ ప్రాంత కాంగ్రెస్​ముఖ్యనేతలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ నేతలు అజారుద్దిన్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కుడా చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, డెయిరీ డెవలప్ మెంట్ చైర్మన్ అమిత్ రెడ్డి, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని, ఇక్కడ డ్రైనేజీ, రోడ్లను డెవలప్​చేయాల్సిన అవసరముందని తెలిపారు. ఎర్రగడ్డ డివిజన్ లోని కాంగ్రెస్ నేతలంతా ఐక్యంగా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదని, పార్టీని గెలిపించడమే ముఖ్యమని అన్నారు. వెంటనే ఎర్రగడ్డ డివిజన్​కు కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ డివిజన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించే బాధ్యత తనది అని స్పష్టం చేశారు.

ఈ డివిజన్ లో ప్రజలను నేరుగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తానని తెలిపారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా త్వరలో పూర్తి చేస్తామని, అలాంటివి ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పథకంలో 2 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈ ఉప ఎన్నిక రాష్ట్ర అభివృద్ధికి సంకేతంగా నిలుస్తుందన్నారు. అధికార పార్టీ గెలిస్తేనే జూబ్లీహిల్స్ అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఉప ఎన్నిక కోసం క్షేత్రస్థాయిలో 18 మంది చైర్మన్‌లను నియమించి బాధ్యతలు అప్పగించారు. అయితే ఇందులో ఒక చైర్మన్ పనితీరు అసంతృప్తిగా ఉందని తుమ్మల మందలించారు. పనిచేయలేకపోతే బాధ్యతల నుంచి తప్పుకోవాలని.. ఇతరులకు వాటిని అప్పగిస్తామని అన్నారు.